Tuesday, April 3, 2018

శివానంద లహారీ

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత...
మహదద్భుత స్తోత్రం
శివానందలహరి
దినమునకొక శ్లోకం...
కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే |
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానన్ద స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ || ............1
కలాభ్యాం = (సకల) కళలయొక్క స్వరూపము తామే అయిన వారు (అగు పార్వతీ పరమేశ్వరులు ఇరువురికీ)
చూడాలంకృత శశికలాభ్యాం = శిరస్సుపై చంద్రరేఖను అలంకరించుకున్నవారు
నిజతపః ఫలాభ్యాం = పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు
భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం = భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు
శివాభ్యాం = పరమ మంగళ స్వరూపులు
అస్తోక త్రిభువన శివాభ్యాం = మూడు భువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు
హృది పునర్భవాభ్యాం = (నా) హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు
ఆనన్ద స్ఫురదనుభవాభ్యాం = ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు (అయిన పార్వతీపరమేశ్వరులకు)
మే నతిరియమ్ = ఇవియే నా నమస్కారములు
భవతు = అగుగాక
సకల కళలయొక్క స్వరూపము తామే అయిన వారు, శిరస్సున చంద్రరేఖను ధరించినవారు, పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు, భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు, పరమ మంగళ స్వరూపులు, త్రిభువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు, నా హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు, నిరంతరమూ ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు అయిన పార్వతీ పరమేశ్వరులకు ఇవియే నా నమస్కారములగుగాక
శివానన్దలహరీ స్తోత్రాన్ని
పరమ పవిత్రమైన *క* వర్ణంతో ప్రారంభించారు ఆచార్యులవారు. పార్వతీ పరమేశ్వరుల తత్వాన్ని, అర్ధనారీశ్వర తత్త్వాన్ని ఆవిష్కరించారు ఈ శ్లోకంలో. శివ శివానీలిద్దరూ ఒకే రకమైన లక్షణ లక్షితులు.
కళాభ్యాం - అంటే సంపూర్ణ కళలతో కూడిన వారు, సకళ నిష్కళ రూపాలలో ఉండువారు. చూడాలంకృత శశి కళాభ్యాం - ఇద్దరి శిరస్సులపైనా చంద్రరేఖ ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఇద్దరూ అమృత స్వరూపులు, అమృత ప్రదాయకులు. 
నిజ తపఃఫలాభ్యాం -
ఎల్లప్పుడూ ఇద్దరూ పరస్పరము ఒకరినొకరు ధ్యానించుకుంటూ ఉంటారు. ఈశ్వరుడు దక్షయజ్ఞం తరువాత సతీ వియోగంతో జగన్మాత కోసం తపస్సు చేశాడు. అమ్మవారు పార్వతీదేవిగా ఉద్భవించి, పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. ఇద్దరూ వారి వారి తపస్సుల ఫలంగా ఒకరినొకరు పొందారు. నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రప్రకటిత ఫలాభ్యాం -  అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఏకమై భక్తులను అనుగ్రహిస్తారు, భక్తులు కోరిన ఫలాలననుగ్రహిస్తారు. అంటే మనం కూడా తపిస్తే, తపస్సు చేస్తే పరమాత్మను పొందుతాము అని చెప్తున్నారు. త్రిభువన శివాభ్యాం శివాభ్యాం - ముజ్జగములలోని వారికీ సకల సన్మంగళాలనూ కూర్చగలిగిన శివ శివా లు. హృది - హృదయంలో పునర్భవాభ్యాం - పరమాత్మ ఎల్లప్పుడూ మన హృదయంలోనే ఉంటాడు. ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే2ర్జున తిష్టతి - ఆ ఉన్న పార్వతీ పరమేశ్వర శక్తి మన ప్రార్ధన వల్ల మన హృదయంలో మళ్ళీ పుట్టినట్లుగా మళ్ళీ మళ్ళీ దర్శనమిచ్చు వారు. ఆనంద - ఆనందము యొక్క స్ఫురత్ - ప్రకాశించు శక్తిని అనుభవాభ్యాం - అనుభవించువారు. అనుక్షణము ఆనంద స్ఫురణను తాము అనుభవిస్తూ భక్తులను అనుభవింపజేయువారు. పార్వతీ పరమేశ్వరులు ఆనందఘనులు. వారిని ఆరాధించువారికి వారి అనుగ్రహం వలన హృదంతరాళాల్లోంచి ఆనందం పెల్లుబుకుతుంది. వారే ఆనంద స్వరూపులవుతారు. అటువంటి శివశివాలకు నమస్కరించుచున్నాను.  ఆనందమే వారు, వారి వద్ద ఉన్నది ఆనందము కనుక వారిని ఆశ్రయించిన భక్తులకు ఆనందాన్ని అనుగ్రహిస్తారు.
అటువంటి శివాభ్యాం ఇయం నతిః - 'శివ' అనే పదం లోనే శివుడు శక్తి ఇద్దరూ ఉన్నారు. శకారం శివ స్వరూపం, ఇకారం శక్తి బీజం. శివ లో నుంచి ఇ ని తీసేస్తే చలనం, చైతన్యం, స్పందన లేని వాడవుతాడు. ఇ కలిస్తే సర్వ మంగళ స్వరూపుడవుతాడు.
" శివః శామ్యతి పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి ఇతి శివః " అని అమరకోశంలో చెప్పారు.
పై విశ్లేషణ డా. టి. విశాలక్షి గారిచే....వారి సౌజన్యంతో